దీనజనబాంధవుడు గుత్తి పట్టు కేశవ పిళ్ళై
(అనంత నానాసాహెబ్)
నేడు ఆయన వర్ధంతి
పందొమ్మిదో శతాబ్దపు ప్రారంభంలో నిస్వార్థ సామాజిక సేవాతత్పరులకు మన దేశంలో కొదువలేదు. ఆ మాటకొస్తే అనంతపురం జిల్లా కూడా తక్కువేం కాదు . కల్లూరి సుబ్బారావు , పప్పూరి రామాచార్యులు , గుత్తి పట్టు కేశవపిళ్ళై వంటి వారిని చెప్పుకోవచ్చు .నిస్వార్థ సేవా తత్పరత కొరవడిన కారణంగానే మన ఈనాటి సీమ దుస్థితి . చట్టసభల్లో ప్రజా ప్రతినిధులు నిర్వహించాల్సిన పాత్ర , సాంఘిక సేవలో మమైక్యత , వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ వంటి విషయాలు కేశవ పిళై నుంచే నేర్చుకోవాలి . ఆయనంతటి సేవా తత్పరతను సీమ సమాజం ఎందుకు మరిచిందో అర్థం చేసు కోవడం కష్టం కాదు . ఆచరణ సాధ్యంకాని , నిప్పులాంటి మనుషులను అనుకరించాలంటే నేటి రాజకీయ నాయకులకు సాధ్యం కాదు . అందుకని ఆయన్ను గుర్తుచేసుకోవటం సీమ సమాజం మానేసింది . ఎవరి జయంతులు వర్ధంతులు జరుపుకుంటే నాలుగు రాళ్లు వెనకేసుకోగలుగుతారో వారినే గుర్తుచేసుకునే దౌర్భాగ్యపు స్థితి నెలకొంది . ఈ స్థితి ఎంతో కాలం ఉండదు .
ఇంతకు కేశవ పిళ్ళై ఎవరు? ఆయన చేసిన సేవలేంటి అని ఆయనను గుర్తు చేసుకోవటం విజ్ఞుల కర్తవ్యం. ప్రజాస్వామ్య వాదుల ఆకాంక్ష , కేశవ పిళ్ళై కోర్టులో సాధారణ ఉద్యోగి , ఉత్తమ శ్రేణి నాయకుడు . సమాజ శ్రేయస్సును కలగన్నవారు , జిల్లా బోర్డు మెంబరు , సాహిత్య పిపాసి , మతసహనం గలవాడు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్త – ఇన్ని సుగుణాలు కలబోస్తే గుత్తి కేశవపిళై అవుతారు . 1860 అక్టోబరు 8 న గుడియాత్తం తాలూకా పట్టు గ్రామంలో వెంకటాచలం సుబ్బమ్మలకు జన్మించారు కేశవ పిళ్లై చిత్తూరులో మెట్రిక్యులేషన్ పాసై కోర్టులో ఉద్యోగిగా చేరారు . తదనంతరం గుత్తి జిల్లా కోర్టులో చేరి న్యాయశాస్త్రం చదువుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి న్యాయవాద వృత్తి చేపట్టారు . బ్రిటిష్ అప్రజాస్వామిక పాలనను ఎదిరించాలంటే , తాను రాసుకున్న చట్టాన్ని తాను ఉల్లంఘించే స్థితిలో ప్రభుత్వమున్నప్పుడు తానేర్పరుచుకున్న కోర్టు ద్వారానే ఎత్తిచూపాలన్న పట్టుదల పట్టు కేశవ పిళ్ళై లో ఉన్నట్లు ఆయన జీవితకార్యాచరణ ద్వారా అర్థమవుతుంది . 1885 డిసెంబరు 28 వ తేదీన మొట్టమొదటి కాంగ్రెస్ ఆవిర్భావ సభ బొంబాయిలో జరిగింది . దానికి కేశవ పిళ్ళై హాజరయ్యారు . గాంధీని జిల్లాకు పిలిపించి తాడిపత్రి , పెద్ద వడుగూరు , గుత్తి , అనంతపురంలో బహిరంగసభలు నిర్వహించారు . ఈ ప్రభావం వల్లే నీలం సంజీవరెడ్డి లాంటి వాళ్లు విదేశీ వస్తు బహిష్కరణ , వందేమాతరం లాంటి ఉద్యమాల్లో ఎందరో చురుకుగా పాల్గొన్నారు . జిల్లాలో రాజకీయ చైతన్యానికి ఆయన కారకుడ య్యాడు . జిల్లా బోర్డు మెంబరుగా ఉండి సమాజంలో అట్టడుగువర్గాలకు చేయూతనిచ్చే పనులు చేశారు .
జిల్లాలో అప్పటికే అంతరించిపోతున్న కంబళి నేత పరిశ్రమలకు ప్రత్యేక నిధులు కేటాయించారు . బాలిక పాఠశాలలకు ప్రాధాన్యత నిచ్చారు . గ్రంథాలయాల స్థాపన వంటి దూరపుటాలోచనలు చేశారు . ఇవన్నీ సాధారణ కార్యక్రమాలే ! దేశంలో ఆనాడు ఎవరైనా చేయగలిగిన పనులే ! ప్రభుత్వ అప్రజస్వామిక పనులను ఆ ప్రభుత్వమేర్పరచుకున్న న్యాయస్థానాల ద్వారానే ఎదిరించడం కేశవ పిళ్లై ప్రత్యేకత . గూళ్యపాలెం హంపన్న ఉదంతం జిల్లా చరిత్ర తెలిసిన వారందరికీ తెలిసిందే . హంపన్న హత్యకు కారకులైన సైనికోద్యోగులకు జిల్లా కోర్టులో శిక్ష పడేటట్లు వాదించారు . ఈ సంఘటనను విద్వాన్ విశ్వం “ ఒకనాడు ” అన్న పేరిట ఒక కావ్యం రాశారు . ఆనాడు హంపన్న శవాన్ని ఊరేగించి గొప్ప బహిరంగ సభల ద్వారా అప్రజాస్వామిక పాలనను ప్రశ్నించారు . విజాతి ప్రభుత్వం చేసే పనులు ఇక్కడ అప్రజాస్వామికమనుకున్నా స్వజాతి ప్రభుత్వాల అప్రజాస్వామిక పాలనను ప్రశ్నించే చైతన్యం ఎందుకు వారసత్వంగా లభించకుండా పోయిందా విజ్ఞులు ఆలోచించాలి . సమాజమంతా ఒక్క గొంతుతో రేపిస్టులను , ఆసిడ్ దాడులను వ్యతిరేకిస్తుంటే ఆ దుశ్చర్యలకు పాల్పడిన వారికి వకాల్తా ఇచ్చే వకీళ్లను కాదు న్యాయవాదులను చూస్తున్నాం . 1910 మార్చి 9 వ తేదీన హిందూపురం రైల్వే ఫ్లాట్ ఫాం పై బ్రిటీష్ పోలీసు ఇద్దర్ని కాల్చి చంపాడు . ఇది అన్యాయమని బహిరంగంగా మాట్లాడలేని స్థితి ఆ రోజులు . అటువంటి సమయంలో కేశవ పిళ్ళై కోర్టులో ఆ పోలీసు పై కేసువేశాడు . నిజానికి హిందూపురంలో ఇటువంటి సంఘటనను గుర్తు చేసే చిహ్నం ఒకటి ఉండి ఉండాల్సింది . దేశభక్తులనే వారు ఈ కార్య క్రమాల్ని చేయడం లేదంటే వీరి దేశభక్తి ఏపాటిది . ఈనాటి సీమ దుస్థితిని గురించి ఈనాడు మన ప్రతినిధులు మాటలు చిలుక పలుకుల్లాంటివనిపిస్తుంది .
ఆనాడు కేశవ పిళ్ళై మద్రాసులో ఎమ్మెల్సీగా ఉండి చేసిన ప్రసంగం వింటే సిగ్గుతో తలవంచుకోవలసి వస్తుంది . ఏకొద్ది రాజకీయ చైతన్యమున్న వారైనా సీమ కరువుచరిత్రను ఏకరువు పెట్టి చెప్పగలరు . కరువుకు కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి తప్పిదాలకు కారకులైన వారి కాలర్ పట్టుకోవడానికి మాత్రం ఎవరూ ఉద్యమాలు నిర్మించరు . పైగా ఇతర ప్రాంతాల వారు మా గురించి ఎవరూ మాట్లాడరని నిందిస్తారు . నీకడుపు నొప్పికి ఇతరులు మందు తింటే తనకెలా నయమవుతుందో అర్థం చేసుకోరు . అనంతపురం జిల్లాను బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో కరువు ప్రాంతానికి కేంద్రంగా అభివర్ణించారు . ఆనాడు నిజాం ప్రభుత్వంతో సానుకూల చర్చలు చేసి తుంగభద్ర ప్రాజెక్టును సాధించుకున్నారు . అప్పుడే ఈ ప్రాజెక్టును సీమకు వరం అని పిలుచుకున్నారు . ఆ సందర్భంగా 1925 మార్చి 5 వ తేదీన మద్రాసు అసెంబ్లీలో చర్చ జరిగింది . ధన్యవాదలు తెలిపే సమయంలో ప్రసంగిస్తూ కేశవపిళై ” I Challenge the Govt . if they can find out one big scheme of irrigation as having been carried out after the advent of the British Govt . ” అని అన్నారు . ఈ మాటలు అక్షర సత్యాలు . ఇప్పటికీ హంద్రీ – నీవాను పూర్తి చేసుకోలేకపోతున్నాం . మన సామాజిక సేవ దేశభక్తి ఏ పాటిదో అర్థం చేసుకోవాలి . ఇంకా ఆ ప్రసంగంలోనే ఆయన సీమ ప్రత్యేకతల్ని ప్రభుత్వ వివక్షతి Jeudoco . ” Now the British Govt . as they saved the delta districts as they have done immense good to the other place . If they could save this districts with big irrigation projects they would be saving crores of rupees which they no waste in famine relief and earn the abinding gratitude of the people ” అని ప్రాంతీయ వివక్షను , కరువు నిధుల పేరిట జరుగుతున్న దోపిడీ ఆదా యాల్ని స్పష్టంగా ఎత్తిచూపారు . మొన్న జరిగిన రాష్ట్ర విభజన నిరసనోద్యమంలో పాల్గొన్న ఉత్సాహవంతుల చైతన్యాన్ని ఎలా శంకించాలి . కేశవ పిళ్ళై మాటల్ని ఎలా నమ్మాలి ? రాజకీయ చైతన్యమా ఇది ? మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్నదేమిటి ? మన ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో ఏం మాట్లాడుతున్నారు ?
పాలగుమ్మి సాయినాథ్ “ ప్రతి ఒక్కరు కరువును ప్రేమించేవారే ” అన్న పుస్తకానికి జవాబు చెప్పగలరా ? కేశవ పిళ్ళై నాటికున్న రాజకీయ చైతన్యం ఈ నాటికి ఇంకా ఎంతగా అభివృద్ధి చెందివుండా ల్సింది ? ఆయన ఆకాంక్షలు సంకుచితమైనవేనని ప్రస్తుత పరిస్థితులనాధారంగా విశ్లేషించి నిరూపించుకోగలమా ? సీమ కరువుకు ప్రతి ఏటా కేటాయించే నిధులెంత ? చేపట్టిన పనులేవి ? ఏమేరకు కరువు నివారణ జగింది ? ఏమేరకు వలసల్ని నివారించగలిగాం ? జీవ ప్రమాణాలు ఏమేరకు పెంచగలిగాం ? కరువును ఎంత దూరం తరిమేశాం ? అన్న ప్రశ్నలే ? తమిళనాడు ప్రాంతం నుంచి వచ్చి ఈ ప్రాంతపు సంక్షేమాన్ని కాంక్షించే ప్రజాస్వామిక తత్వం కేశవ పిళ్ళై లో ఉంది . అందుకే కాళోజీ నారాయణరావు “ ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే వాణ్ణి పారదోలు , ప్రాంతం వాడే దోపిడీ చేస్తే పాతర వెయ్యి ” అన్నాడు . కేశవ పిళ్ళై ను కేవలం రాజకీయ కార్యకర్తగానే చూడలేం . మహాకవి పోతన జన్మస్థల చర్చను పక్కన బెట్టి చూస్తే 1914 లో పోతన మెమోరియల్ ట్రస్టును ఏర్పాటు చేసి కడప జిల్లా కలెక్టరు నేతృత్వంలో ఒంటిమిట్టలో సాహితీ సభలు నిర్వహించారు . ఈ సందర్భంలో దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు కేశవ పిళ్ళై ను అభినందిస్తూ భారతీయ సంస్కృతిని ఎత్తిపడుతున్న మహావ్యక్తిగా కేశవ పిళ్లై ను అభినందించారు . మరెందుకో సంస్కర్తలైన బ్రహ్మంగారిని , వేమనను గురించి కేశవ పిళ్ళై ఎక్కడా ప్రస్తావించినట్లు లేదు . ఆయన వైష్ణవ సంప్రదాయకుడు కావడమేనా ? ఇందుకు అపవాదం కూడా ఉంది ! కేశవపిళై న్యాయవాది , రాజకీయవేత్తనే కాదు . జర్నలిస్టు కూడా హిందూ దినపత్రికకు ఎన్నో వ్యాసాలు రాసేవాడు . ఈ సందర్భంగా మరో విషయం బ్రిటిష్ గయానాకు వెళ్లి అక్కడి భారతీయుల స్థితిగతులపై ఒక నివేదికను మద్రాసు ప్రభుత్వానికి సమర్పించారు . 1876 సీమ విపరీతమైన క్షామానికి గురైంది .
బ్రిటిష్ ప్రభుత్వం బ్రిటిష్ గయానాకు ఇక్కడి నుంచి ప్రజల్ని తరలించారు . స్వచ్ఛదంగా కూడా కొందరు వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది . అనంతపురం ప్రాంతం నుంచి కొందరు సభ్యులుగా ఏర్పడి ఒక సంఘం కొన్ని నెలలపాటు బ్రిటిష్ గయానాలో ఉంది . ప్రత్యక్షంగా పరిశీలించి నివేదిక తయారు చేశారు . ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో బతుకులీడుస్తున్న వారి పట్ల మన నాయకుల వైఖరేమిటని ప్రశ్నించుకోవాలి . అక్కడ చనిపోతే శవాన్ని ఆఖరీ చూపులకైనా నోచుకొని దుస్థితికి బాధ్యులెవరిని చేయాలి . వీరి ప్రజాస్వామిక తత్వం ఏపాటిది ? కాలక్రమంలో సంక్షేమ దృష్టి పాలకుల్లో పెరుగుతూ వుందనుకోవాలి ? కేశవ పిళ్ళై గారికి దేశవ్యాప్తంగా పరిచయాలుండేవి . దేశ బంధు చిత్తరంజన్ దాస్తోనూ , ఇంకా బ్రిటిష్ ఉన్నతాధికారులతోనూ ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేవారు . ఒకసారి బళ్లారి జైలులో పంజాబ్ సన్యాసి ఒకరు తనకు పాలు ,పళ్లు మాత్రమేకావాలని ఉపవాస దీక్షకు కూర్చున్నారట . ప్రభుత్వం పట్టించుకోలేదని సత్వరమే చర్య తీసుకోవాలని బళ్లారి రాఘవ ఒక ఉత్తరం కేశవ పిళ్ళై కు రాశారు . కేశవ పిళ్ళై జోక్యంతో సమస్య పరిష్కారమైంది . కేశవపిళై రాత్రి బైబిలు చదువుకుంటూ అందులో కొన్ని పంక్తుల్ని పెన్సిల్ లో గుర్తిస్తూ ఉండి హఠాత్తుగా 1933 మార్చి 28 వ తేదీన నిర్యాణం చెందారు . ఆ మంచం పై మరోపక్క భగవద్గీత కూడా ఉంది . అంతరంగంలో ఆయనఆధ్యాత్మికవాది అని తెలుస్తుంది . మరి నేటి రాజకీయ నాయకుల మంచం పక్క మరేముంటాయో ? సత్య సంధత , సత్యనిష్ట అన్న మాటలకు అర్థం తెలిసిన వారు కేశవ పిళ్ళై. రాజకీయ నాయకులకు అనివార్యంగా ఉండాల్సిన తాత్వికత , అదీ ముఖ్యంగా రాజకీయార్థిక తాత్వికత , ఇప్పుడీమాటలకు ఉదాహరణలు చూపించడం కష్టం , ఇటువంటి నాయకులుండం మన భాగ్యం .
