త్యాగాల మధ్య తాత్విక మలుపు !!

 త్యాగాల మధ్య తాత్విక మలుపు !!

భారతదేశ చరిత్రలో కొన్ని ఉద్యమాలు కేవలం రాజకీయ సంఘటనలు గా మాత్రమే కాకుండా కాలాన్ని కదిలించే భావోద్వేగ తరంగాలు గా రూపు దిద్దుకున్నాయి . కొన్ని పోరాటాలు కేవలం సిద్ధాంతాల గోల కాదు — తరాల ఆవేదనకు ప్రతిధ్వనులు. అలాంటి ఉద్యమాల్లో ఒకటి నక్సలైట్ ఉద్యమం. ఇప్పుడు వరుసగా అగ్రనేతలు లొంగిపోతున్న ఈ సమయంలో సమాజం ముందు కొన్ని ప్రశ్నలు మిగిలిపోతున్నాయి.ఇది ఒక శకం ముగిసిందని ప్రకటించే క్షణమా? లేక ఒక లోతైన రూపాంతరానికి నాంది పలుకుతున్న దశనా ?

1967లో నక్సల్‌బరి అనే చిన్న గ్రామంలో మొదలైన రైతు తిరుగుబాటులో ఉంది. భూమి కోసం, గౌరవం కోసం, సామంత అణచివేతకు వ్యతిరేకంగా అగ్నికణంలా చెలరేగిన ఆ సంఘటన త్వరలోనే సిద్ధాంతపరమైన సాయుధ పోరాటంగా మారింది. చారు మజుందార్, కానూ సన్యాల్ వంటి నాయకులు “సాయుధ విప్లవమే మార్గం” అని నమ్మారు. గ్రామీణ పేదల నిస్సహాయ కేకలను తుపాకీ స్వరాలుగా మార్చారు.1970లలో ఉద్యమం తీవ్ర అణచివేతను ఎదుర్కొంది. కానీ ఆ అగ్ని పూర్తిగా ఆరిపోలేదు. అది ఆంధ్రప్రదేశ్ అరణ్యాలలో, బీహార్ పల్లెలలో, జార్ఖండ్ గనుల ప్రాంతాల్లో, ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మళ్లీ మంటలెగిసింది. పీపుల్స్ వార్ గ్రూప్ మరియు మావోయిస్టు కమ్యూనిస్ట్ సెంటర్ వంటి సంస్థలు గ్రామీణ భారతంలో తమ ప్రభావాన్ని విస్తరించాయి. 2004లో ఇవి విలీనం చెంది కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మావోయిస్టు ) గా రూపుదిద్దుకోవడం ఉద్యమ చరిత్రలో కీలక మలుపు. ఆ తరువాత దశాబ్దంలో ఈ సంస్థ దేశ అంతర్గత భద్రతకు అతిపెద్ద సవాలుగా అభివర్ణించబడింది.

అయితే ఈ కథను కేవలం హింసా చరిత్రగా చదవడం ఒక పాక్షిక దృక్కోణం మాత్రమే. ఇది సామాజిక అసమానతల చరిత్ర కూడా. అడవుల్లో తమ హక్కులు కోల్పోయిన ఆదివాసి, అభివృద్ధి పేరిట భూమి కోల్పోయిన రైతు, పాలనా యంత్రాంగం తలుపులు తట్టినా వినిపించని పేదవాడి వేదన — ఇవే ఈ ఉద్యమానికి ఇంధనం. ఒక దశలో “ఎర్ర జోన్”గా పిలువబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం కన్నా పార్టీ ప్రభావమే బలంగా కనిపించేది. అది కేవలం తుపాకీ బలం కాదు, వినిపించని గొంతుకలకు ఒక ప్రత్యామ్నాయ వేదికగా కనిపించిన మాయాభాసం కూడా. కానీ కాలం మారింది. భద్రతా వ్యూహాలు కఠినమయ్యాయి. అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. రహదారులు అడవుల్లోకి చొచ్చుకెళ్లాయి. పాఠశాలలు వెలుగులు నింపాయి. డిజిటల్ కనెక్టివిటీ ఒంటరితనాన్ని చెరిపేసింది. అంతర్గత విభేదాలు, సిద్ధాంత సంక్షోభం, స్థానిక మద్దతు క్షీణత — ఇవన్నీ కలసి ఉద్యమాన్ని బలహీనపరిచాయి. ఇప్పుడు అగ్రనేతల లొంగుబాట్లు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయి.తుపాకీ సాధించలేనిదాన్ని సంభాషణ సాధించగలదనే అవగాహన పెరుగుతోందనిపిస్తోంది.

ఇక్కడ ఒక కఠోర వాస్తవాన్ని విస్మరించకూడదు. ఈ సుదీర్ఘ పోరాటంలో అమాయక పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో మరణించిన పోలీసులు, జవాన్లు ఎవరో ఒకరి కుమారులు, భర్తలు, తండ్రులే. వారి కుటుంబాల ఆశలు ఒక్క క్షణంలో శవపేటికలతో మిగిలిపోయాయి. అదే సమయంలో బాంబు పేలుళ్లలో, కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన నిరపరాధ పౌరుల నిశ్శబ్ద మరణాలు గణాంకాల్లో మాత్రమే మిగిలిపోయాయి.ఇంకో వైపు ఆశయం కోసం అడవుల్లో అడుగుపెట్టిన యువజీవితాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. వారిలో చాలామంది పేదరికం, అన్యాయం, అవమానం అనుభవించి ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. వారి తల్లుల కన్నీరు కూడా అంతే ఉప్పుగానే ఉంది. ఒక తల్లి కోల్పోయిన తన కుమారుడి బాధకు యూనిఫాం రంగు తేడా ఉండదు. ఒక చిన్నారి కోల్పోయిన తన తండ్రి ప్రేమకు సిద్ధాంతం పేరు ఉండదు.

ఈ త్యాగాలకు విలువ ఏమిటి? తుపాకీ గెలిచిన రోజుల్లో భయం పెరిగింది. కానీ న్యాయం పెరిగిందా? శవపేటికలు పెరిగాయి కానీ సమానత్వం పెరిగిందా? హింసలో మృతిచెందిన ప్రతి ప్రాణం మన ప్రజాస్వామ్యానికి ఒక ప్రశ్నార్థకం.త్యాగాలకు నిజమైన గౌరవం ప్రతీకారంలో కాదు, పరివర్తనలో ఉంటుంది. అమరులైన పోలీసుల స్మృతికి నిజమైన నివాళి భద్రతతో పాటు న్యాయం అందించడంలో ఉంది. ఆశయంతో ప్రాణాలు కోల్పోయిన నక్సలైట్ల స్మృతికి గౌరవం ఇవ్వాలంటే, వారు ఎత్తిన అసమానత ప్రశ్నలకు రాజ్యాంగబద్ధ పరిష్కారం చూపాలి. పౌరుల మరణాలకు న్యాయం చేయాలంటే, హింసకు దారి తీసిన పరిస్థితులను సమూలంగా సవరించాలి.
రాజ్యాంగాన్ని విశ్వసించే మనందరికీ ఇది ఒక హెచ్చరిక. అణగారిన వర్గాల గళం వినిపించకపోతే చరిత్ర కొత్త రూపంలో పునరావృతమవుతుంది. తుపాకీ నిశ్శబ్దమైతే సరిపోదు, అన్యాయం కూడా నిశ్శబ్దం కావాలి. “ఒక శకం ముగిసింది” అని చెప్పేముందు మనం ఆలోచించాల్సింది — ఆ శకం ఎందుకు మొదలైంది? అది మళ్లీ పుట్టకుండా ఉండేందుకు రాష్ట్రం, సమాజం, మేధావులు ఏం చేయాలి? లొంగుబాట్లు వార్తలు కావచ్చు, కానీ సామాజిక న్యాయం సాధించడమే అసలైన ముగింపు. ఈ సందర్భం మనకు గుర్తుచేసేది ఒక శాశ్వత సత్యం. తుపాకీతో గెలిచేది భయం మాత్రమే; హృదయాలతో గెలిచేది న్యాయం.

రాజ్యాంగం చూపిన మార్గం సుదీర్ఘమైనదైనా, అదే స్థిరమైనది. ఒక శకం ముగిసిందనిపిస్తున్న ఈ వేళ, కొత్త శకం — సంభాషణ, సామరస్యం, సమానత్వం — ప్రారంభమవ్వాలి. అప్పుడు మాత్రమే అమరులైన ప్రతి ప్రాణానికి మనం చెప్పగలిగే నిజమైన నివాళి.

Editor

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *