వీధి కుక్కల సమస్యకు విరుగుడేమిటి?
వీధి కుక్కల సమస్య నేడు మన దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇందుకు గల కారణాలను విశ్లేషిస్తే ఇందులో ప్రభుత్వాల ఉదాశీనత, నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. రోజూ ఎక్కడో ఒకచోట కుక్క కాటు, చిన్నపిల్లలపై దాడి,మహిళల పై దాడి, వృద్ధుల మరణం… ఈ వార్తలు ఇప్పుడు సామాన్యమైపోయాయి. కానీ అసాధారణమైనది ఏమిటంటే – ఇవన్నీ జరుగుతున్నా పాలకుల చెవికి చిల్లులు పడడం లేదు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వాలకు మాత్రం నిద్ర మత్తు వీడడం లేదు.
కుక్కలు ఎందుకు వీధుల్లో పెరిగిపోయాయి? ఇది ప్రకృతి తప్పా? జంతువుల తప్పా? కాదు. ఇది పూర్తిగా మన పాలన తప్పు. చెత్తను సరిగ్గా నిర్వహించని మునిసిపల్ పాలన, ప్రణాళిక లేకుండా విస్తరిస్తున్న నగరాలు, జనాభా నియంత్రణ పేరుతో కాగితాల మీదే మిగిలిపోయిన స్టెరిలైజేషన్ ప్రోగ్రాములు – ఇవన్నీ కలిసి వీధి కుక్కలను ఒక “సమస్య”గా తయారుచేశాయి. కానీ ఇప్పుడు అదే సమస్యకు బాధ్యత కుక్కల మీదకు నెట్టేసి, పాలకులు చేతులు దులుపుకుంటున్నారు.
కుక్క కాటు అంటే కేవలం గాయం కాదు, అది ఒక ప్రాణాంతక హెచ్చరిక. రేబీస్ అనే వ్యాధి ఒకసారి మొదలైతే మానవుడు బతికే అవకాశం ఉండదు. ఈ సత్యం తెలిసినా, ప్రజలకు సరైన టీకాలు, అవగాహన, సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతున్నాయి. కోట్లకు కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తున్న ప్రభుత్వాలు, ఒక సామాన్యుడి ప్రాణాన్ని కాపాడే టీకాను మాత్రం ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంతరం అందుబాటులో ఉంచలేకపోతున్నాయి. ఇది వైఫల్యం కాదు, ఇది నేరం.

ఇదే సమయంలో పాలకులు ఒక విచిత్రమైన ద్వంద్వ ధోరణి పాటిస్తున్నారు. ఒకవైపు జంతు ప్రేమ పేరిట కుక్కలను తొలగించలేమంటారు. మరోవైపు ప్రజల మరణాలపై మాత్రం నోరు మెదపరు. ప్రజలు చనిపోతే అది “దురదృష్టం”, కుక్కకు ఏదైనా జరిగితే మాత్రం అది “మానవ హక్కుల ఉల్లంఘన”గా మారిపోతుంది. ఈ అసమతుల్యతే ప్రజల కోపానికి కారణమవుతోంది. ప్రభుత్వాలు స్పష్టంగా చెప్పాలి – మనకు మొదట మనిషి ప్రాణమా? లేక పరిపాలనా మొద్దుతనమా?
చట్టాలు ఉన్నాయి. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ ఉన్నాయి. స్టెరిలైజేషన్, టీకాలు, నిర్వహణ పథకాలు ఉన్నాయి. కానీ అవన్నీ కాగితాలకే పరిమితం. ఎందుకు? ఎందుకంటే అమలు చేయాల్సినవారికి బాధ్యత భావన లేదు. అధికారులకు ఫైళ్లు కదలకపోతే ప్రజల ప్రాణాలు కదిలిపోతున్నాయి. ఇదే ఈ వ్యవస్థ యొక్క క్రూరత.
సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది – వీధి కుక్కల ప్రవర్తన ఊహించలేనిది, ప్రజల భద్రతను తక్కువ అంచనా వేయలేమని. కానీ ఆ వ్యాఖ్యలను అమలు చేసే ధైర్యం పాలకులకు లేదు. ఎందుకంటే ఈ అంశం ఓట్లతో ముడిపడి ఉంది. ఒక వర్గాన్ని సంతోషపెట్టాలనే రాజకీయ లెక్కలే, మరో వర్గ ప్రాణాలను పణంగా పెట్టే పరిస్థితికి తీసుకొచ్చాయి. ప్రజల భద్రత ఓటుబ్యాంక్ కంటే తక్కువ విలువైనదా?
ఇక జంతు ప్రేమ పేరిట రోడ్ల మధ్యలో, స్కూళ్ల ముందు, ఆసుపత్రుల దగ్గర కుక్కలకు ఆహారం పెట్టడం ఒక ఫ్యాషన్‌గా మారింది. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు మాత్రం మౌనం వహిస్తున్నాయి. ఎందుకంటే ప్రశ్నిస్తే “ప్రేమికుల” భావోద్వేగాలు దెబ్బతింటాయట! మరి చిన్నపిల్ల చనిపోతే అతని తల్లిదండ్రుల భావోద్వేగాలు ఎవరు పట్టించుకుంటారు? పాలకులకు జంతువుల కన్నీళ్లు కనిపిస్తున్నాయేమో కానీ, మనుషుల కన్నీళ్లు కనిపించడం లేదు.
వీధి కుక్కలు సమస్య కాదు, అవి మన పాలకుల నిర్లక్ష్యానికి కనిపించే రూపం మాత్రమే. ఆ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని వరకూ, వీధులు సురక్షితంగా మారవు. మనం కుక్కలతో కాదు, మొద్దు పాలనతో యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే ప్రజలు ఉంటేనే, బాధ్యత వహించే పాలకులు పుడతారు.
